షాకింగ్ & బ్రేకింగ్: నెట్‌లో బాహుబలి2 మొదటి 50 నిమిషాల సినిమా!


దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాహుబలి2 ఇవాళ విడుదలైంది. విడుదలైన ప్రతీచోట పాజిటవ్ టాక్‌తో ఈ సినిమా దూసుకుపోతోంది. హిట్ టాక్ రావడంతో సంతోషంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్, చిత్ర యూనిట్‌ను పైరసీ వ్యవహారం నిరాశకు గురిచేస్తుంది. బాహుబలి2 మొదటి 50 నిమిషాల సినిమా ఆన్‌లైన్‌లో లీకైంది. సినిమాను లీక్ చేసిందెవరో తెలుసుకునేందుకు ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిందితులను కనుగొనే పనిలో పడ్డారు. నిన్న సాయంత్రం ఈ సినిమా బెన్‌ఫిట్ షోను పలుచోట్ల ప్రదర్శించారు. ఆ సమయంలో వీడియోను రికార్డ్ చేసి నెట్‌లో పెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

పైరసీ సినిమాలను ప్రోత్సహించే ఓ ప్రముఖ పైరసీ మూవీ సైట్‌లో కూడా బాహుబలి2 50 నిమిషాల సినిమా హల్‌చల్ చేస్తోంది. పోలీసులు, ఫ్యాన్స్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ పైరసీని నియంత్రించలేకపోతున్నారు. పైగా డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుండటంతో ఇంకెంత మందికి ఈ పైరసీ ప్రింట్ షేర్ అవుతుందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పైరసీ లింక్ వాట్సాప్‌లో వైరల్ అవుతుండటం మరింత కలవరపాటుకు గురిచేసే విషయం. సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీ ప్రింట్ అందుబాటులోకి రావడం వెనుక ఎవరెవరున్నారో తెలుసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇన్నేళ్లుగా లక్షల మంది కష్టానికి ప్రతిరూపంగా తెరకెక్కిన ఈ సినిమా పైరసీని చూసి పొట్ట కొట్టొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.